టాలీవుడ్ లో మెగా కుటుంబానికీ, అల్లు కుటుంబానికీ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ నేపథ్యంలో పుష్ప 2 చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల సందడి కనిపించింది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మెగా కుటుంబాన్ని పొగడకపోవడంతో అవమానంగా భావించి ఆగ్రహించిన జనసేన నేత ఒకరు పుష్ప 2 సినిమా ఎలా విడుదలవుతుందో చూద్దామంటూ హెచ్చరించారు.

పుష్ప 2 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మెగా కుటుంబాన్ని అవమానించిన అల్లు అర్జున్ 24 గంటల్లో చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,నాగబాబుకు క్షమాపణలు చెప్పాలని గన్నవరం జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు డిమాండ్ చేశారు. లేకుంటే పుష్ప 2 చిత్రాన్ని జన సైనికులు, మెగా అభిమానులు అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో చివరి నిమిషంలో ఈ వ్యవహారం తిరిగి జనసేనకూ, మెగా ఫ్యామిలీకి చికాకుగా మారింది. దీంతో ఏకంగా చిరంజీవి సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబే జోక్యం చేసుకున్నారు.

చలమలశెట్టి రమేశ్ బాబుకు నిన్న రాత్రి నాగబాబు ఫోన్ చేసి.. పుష్ప 2ను అడ్డుకోవాలన్న ప్రయత్నాలు విరమించుకోవాలని సూచనతో కూడిన హెచ్చరిక చేశారు. దీంతో పుష్ప-2 ప్రీమియం షో అడ్డుకుంటామన్న మాట వెనక్కి తీసుకుంటున్నట్లు చలమల శెట్టి రమేష్ బాబు వీడియో విడుదల చేశారు. పుష్ప-2 అల్లు అర్జున్ సినిమా అడ్డుకుంటానని ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

పుష్ప 2 అడ్డుకుంటామని తాను చేసిన ప్రకటన వీడియోను చూసి జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ కొణిదల నాగబాబు స్వయంగా ఫోన్ చేశారని, నాగబాబు ఫోన్ చేసి రాజకీయం వేరు సినిమాల వేరు అన్నారని ఆయన తెలిపారు. మీరు సినిమాలు ఆపే విషయంలో పునరాలోచించుకోవాలని సూచన చేశారన్నారు. నాగబాబు ఆదేశాల మేరకు పుష్ప-2 సినిమాని అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related Videos