పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్‌ని హుషారెత్తిసున్నారు. జులై నెలలో ‘ హరిహర వీరమల్లు ’తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ఈ నెలలో ‘ ఓజీ ’తో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ ‘ఓజాస్ గంభీర’గా కనిపించనున్నాడు. మాఫియా డాన్‌గా ఉన్న అతడు సడెన్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి పదేళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి తన ప్రత్యర్థిని ఎలా మట్టుబెట్టాడు అన్నదే ఈ సినిమా కథ అని ప్రచారంలో ఉంది. ఇటీవల విడుదలైన "Fire Storm" పాటలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎలివేట్ చేశారు. ఈ పాటలో ఆయన స్టైలిష్ లుక్స్, యాక్షన్, గన్ ఫైటింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక గ్లింప్స్, టీజర్లలో పవన్ స్టైలిష్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం రిలీజ్‌కి ఇంకా వారం రోజులే ఉన్నప్పటికీ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫీలవుతూ మేకర్స్‌ని తిట్టిపోస్తున్నారు. మరోవైపు ప్రమోషన్లు కూడా పెద్దగా లేకపోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో పాల్గొంటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘ఓజీ’ ప్రమోషన్లలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని, ఒకట్రెండు కామన్ ఇంటర్వ్యూలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆయన పాల్గొననున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ కనీసం ఆ అదృష్టమైనా కల్పిస్తున్నందుకు నిర్మాణ సంస్థకు ధన్యవాదాలు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమాకి పవన కళ్యాణ్ భారీగా ప్రచారం కల్పించిన సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పాల్గొనడమే కాకుండా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన తన బాధ్యతల్ని పక్కనబెట్టి నాలుగు రోజుల పాటు బాగా కష్టపడ్డారు. తన ఇన్నేళ్ల కెరీర్లో ఏ సినిమాకి తాను ప్రమోషన్లలో పాల్గొనలేదని.. ఏఎం రత్నం మీద అభిమానంతోనే తాను ప్రమోషన్లకి వచ్చానని పవన్‌కళ్యాణ్ అప్పట్లో తెలిపారు. ఈ చిత్ర విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శలకు కూడా గురయ్యారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఆయన ప్రజల్ని పట్టించుకోకుండా ఇలా సినిమాల చుట్టూ తిరగడం సరికాదని చాలామంది విమర్శించారు. అయితే పవన్ అంత కష్టపడినా ‘హరిహర వీరమల్లు’ చిత్రం డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. ‘ఓజీ’కి ఇప్పటికే భారీ హైప్ ఉన్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రమోషన్లు చేయకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos