ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కీరవాణికి పితృవియోగం కలిగింది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. శివశక్తి దత్తా పలు సినిమాలకు పాటలు రాశారు. ఆయన చిత్రలేఖనం కూడా అద్భుతంగా చేసేవారు. ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు, దర్శకుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్‌ కు శివశక్తి దత్తా సోదరుడు అవుతారనే సంగతి తెలిసిందే. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శివశక్తి దత్తా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 

శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆయన రాజమండ్రి సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత... కళలపై ఆసక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ముంబైలోని ఓ ఆర్ట్స్‌ కాలేజీలో చేరారు. రెండేళ్ల తర్వాత కొవ్వూరుకు తిరిగొచ్చి కమలేశ్‌ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. ఆ తర్వాత సంగీతంపై ఇష్టంతో గిటార్‌, సితార్‌, హార్మోనియం నేర్చుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానకి రాముడు చిత్రం కోసం తొలిసారిగా స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు. అలాగే తెలుగులో మరికొన్ని చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. 

ఈ క్రమంలోనే ప్రసిద్ధ చిత్రకారుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, గేయ రచయితగా గుర్తింపు పొందారు. ఛత్రపతి, రాజన్న, సై, బాహూబలితో పాటు పలు చిత్రాలకు పాటలు రాశారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే ''రామం రాఘవం'' పాటకు కూడా ఆయనే సాహిత్యం రాశారు. దక్షిణ భారత భాషలతో పాటు సంస్కృతంపై శివశక్తి దత్తాకు మంచి పట్టు ఉంది. శివశక్తి దత్తాకు ముగ్గురు కొడుకులు... కీరవాణి, కల్యాణి మాలిక్‌, శివశ్రీ కంచి. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos