కన్నడ భాషకు తమిళ భాష తల్లి వంటిదంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సీనియర్ నటుడు కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ ను కర్నాటకలో విడుదల కానివ్వబోమన్న హెచ్చరికలు, ఆ తర్వాత ఆయన సారీ చెప్పాలంటూ హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తీవ్రంగా తప్పుబట్టింది. కర్నాటక హైకోర్టు తీరుతో పాటు కన్నడ సంఘాల హెచ్చరికల్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఈ కేసును తాము స్వయంగా విచారిస్తామని ప్రకటించింది. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో పలు కన్నడ సంఘాలు కర్నాటకలో థగ్ లైఫ్ విడుదల కానివ్వబోమంటూ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు ఆటంకాలు లేకుండా చూడాలంటూ కర్నాటక హైకోర్టులో కమల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కమల్ తన వ్యాఖ్యలపై కన్నడ ప్రజలకు సారీ చెప్పాలని హైకోర్టు సూచించింది. అయితే అందుకు కమల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కర్నాటక హైకోర్టులో జరుగుతున్న ఈ కేసు విచారణను తమకు బదిలీ చేసుకున్న సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. కమల్ ను సారీ చెప్పమని కోరే అధికారం మీకు ఎక్కడుందని ఈ సందర్భంగా హైకోర్టుకు చీవాట్లు పెట్టింది. అలాగే కమల్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన సినిమా ప్రదర్శించే థియేటర్లు తగులబెడతామన్న హెచ్చరికలు చేయడమేమిటని ప్రశ్నించింది. కమల్ వ్యాఖ్యలు చేస్తే మీరు కూడా కౌంటర్ ఇవ్వండి, అంతేకానీ ఈ హెచ్చరికలేమిటని ఆక్షేపించింది. మూక బెదిరింపులకు చట్టబద్ద పాలనను తాకట్టు పెట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. థియేటర్లలో ఏమి ప్రదర్శించాలో గూండాల సమూహాలు నిర్ణయించడానికి అనుమతించలేమని కూడా హెచ్చరించింది. కమల్ వ్యాఖ్యలతో విభేదించే హక్కు కర్నాటక ప్రజలకు ఉందని, అదే సమయంలో ఆయన ప్రాథమిక హక్కును కూడా పరిరక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఒక ప్రకటన చేసినప్పుడు అందరూ అందులో జోక్యం చేసుకున్నప్పుడు వ్యవస్థలో ఏదో లోపం ఉందని తెలిపింది. అనంతరం ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెన్సార్ బోర్డు ఓ సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని చూడాలా వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని, అంతేకానీ.. విడుదల కాకుండా చేసే హెచ్చరికలు తప్పని పేర్కొంది.

Related Videos