తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ప్రధానమైంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండుగ సమయాల్లో ఈ రోడ్డుపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు, టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి చూడటం ప్రయాణికులకు ఒక నరకంలా మారుతోంది. అయితే, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తోంది. తాజాగా యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 

గురువారం సాయంత్రం పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూత్‌లు ఉండగా విజయవాడవైపు వెళ్లే మార్గంలో 8 బూత్‌లను ఈ పరీక్ష కోసం కేటాయించారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ ట్రయల్ రన్‌లో శాటిలైట్ సాంకేతికత పనితీరును అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ నూతన విధానంలో వాహనం టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. శాటిలైట్, హై- స్పీడ్ కెమెరాల సాయంతో వాహనం, నంబర్‌ను గుర్తించి, సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు కట్ చేస్తారు. ఈ ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందంటే, కేవలం 3 సెకన్లలోనే ఫాస్టాగ్ స్కాన్ పూర్తవుతుంది. దీని వల్ల నిమిషానికి 20 వాహనాలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్లాజాను దాటి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఏదైనా కొత్త సాంకేతికతను ప్రవేశ పెట్టినప్పుడు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు సహజం. పంతంగి వద్ద నిర్వహించిన పరీక్షల్లో కూడా కొన్ని సాంకేతిక లోపాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వాహనాలు ప్లాజా దాటుతున్నప్పుడు సెన్సార్లు సరిగా స్పందించకపోవడం, టోల్ వసూలు కాకపోవడం వంటి అంశాలను గుర్తించారు. ఈ లోపాలను సరిదిద్దే పనిలో ప్రస్తుతం NHAI, టోల్‌ప్లాజా సాంకేతిక నిపుణులు నిగ్నమయ్యారు.  రాబోయే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఒక వేళ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగితే, అదనంగా రెండు బూత్‌లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ హ్యాండ్‌ గన్ ద్వారా ఫాస్ట్‌గన్‌లను స్కాన్ చేసి ట్రాఫిక్ రద్దీని వేగంగా క్లియర్‌ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్‌- విజయవాడ హైవేపై ప్రస్తుతం పంతంగి వద్ద మాత్రమే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన టోల్ ప్లాజాల్లో దీనిని విస్తరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos