ఏపీ రాజకీయాల్లో యువనేత, మంత్రి నారా లోకేష్ తన పనితీరుతో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించిన తర్వాత, నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సంక్షేమం విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, లోకేష్ సృష్టిస్తున్న ఈ స్టాండర్డ్ ను అందుకోవడంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నారా లోకేష్ మంగళగిరిలో కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా, ఒక వ్యవస్థగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు ఐటీ, విద్యాశాఖల మంత్రిగా సచివాలయంలో ఫైళ్లను క్లియర్ చేస్తూనే, ఇటు మంగళగిరిలోని పాఠశాలలకు ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం వంటి చర్యల ద్వారా గ్రౌండ్ లెవల్లో బలమైన ముద్ర వేస్తున్నారు. పర్యటనల్లో ప్రోటోకాల్ ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లడం ఆయన పనితీరులోని ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. లోకేష్ తనను తాను ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో .. టీడీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం పాత ధోరణిలోనే సాగుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత ఆధిపత్యం, స్థానిక వివాదాలు మరియు కాంట్రాక్టుల చుట్టూ కొందరు నేతలు తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లోకేష్ తరహాలో టెక్నాలజీని వాడుకోవడం లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండటం వంటి అంశాలను వీరు లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
రాజకీయాల్లో ఇప్పుడు వ్యక్తిగత ఇమేజ్ కంటే ప్రజాబలం ముఖ్యం. లోకేష్ తన ఇమేజ్ను మంగళగిరిలో చేసిన సేవా కార్యక్రమాల ద్వారా పెంచుకున్నారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారన్న ముద్రను చెరిపేసుకోలేకపోతున్నారు. లోకేష్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఒక రకంగా టీడీపీ నేతలకు సవాల్‌గా మారాయి. ఆయన వేగాన్ని తట్టుకుని నిలబడాలంటే, ఎమ్మెల్యేలు తమ పనితీరును సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారా లోకేష్ ఇప్పుడు 'నెక్స్ట్ జనరేషన్' లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కేవలం లోకేష్ ఒక్కరు కష్టపడితే సరిపోదని, పార్టీలోని ఎమ్మెల్యేలందరూ అదే స్థాయిలో కష్టపడితేనే 2029 ఎన్నికల నాటికి టీడీపీ మళ్ళీ తిరుగులేని శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్‌ను చూసి మిగిలిన ఎమ్మెల్యేలు ఎప్పుడు చక్కబడతారో మరి వేచి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos