ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్వ వైభవం కనిపిస్తోంది. ఐదేళ్లుగా నిర్మాణ ప్రాంతాల్లో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో వేలాది మంది కార్మికులు నిత్యావసరాలు, బట్టల కొనుగోలు కోసం రాజధాని గ్రామాల్లోని రోడ్ల మీదకు రావడంతో ఆయా ప్రాంతాలు జాతరను తలపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ మోక్షం లభించింది. ప్రస్తుతం వివిధ నిర్మాణాల్లో 13 వేల మంది కార్మికులు నిమగ్నమై ఉండగా, జనవరి నుంచి పనుల వేగం మూడు రెట్లు పెరగనుంది. ఇందుకోసం కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే మానవ వనరుల సరఫరా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జనవరిలో మరో 30 వేల మంది కార్మికులు అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు. కేవలం భవనాలే కాకుండా రైతులకు కేటాయించిన ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రంక్ రోడ్లు, ఐకానిక్ భవనాల నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. 2014-19 మధ్య అమరావతిలో ఏ స్థాయిలో సందడి ఉండేదో, సరిగ్గా అలాంటి అద్భుత దృశ్యం మళ్లీ నవనగరంలో ఆవిష్కృతం అవుతోంది.

ఇందులో భాగంగా అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణం వేగవంతమైంది. రాబోయే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా.. ట్రాఫిక్ సమస్యలు లేకుండా విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. హైస్పీడ్ కనెక్టివిటీతో పాటుగా అందించడమే లక్ష్యంగా ఈ రోడ్లు నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో ఆర్టీరియల్ రహదారులను నిర్మిస్తున్నారు. ఆర్టీరియల్ రహదారులు అంటే నగరంలో ముఖ్యమైన ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులు. భవిష్యత్తులో వచ్చే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ పనులు చేపడుతున్నారు. రోడ్లు చాలా విశాలంగా, అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. అమరావతికి సులభంగా చేరుకోవడానికి, 9 వరుసలతో కూడిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రహదారుల కింద వరద నీటిని అదుపు చేసే వ్యవస్థ, తాగు నీటి పైపులు, డ్రైనేజీ, విద్యుత్తు లైన్లు, ఇంటర్‌నెట్‌ కేబుల్స్ వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ చాలా వేగంగా జరుగుతుండటంతో అమరావతి ప్రాంతం అభివృద్ధి పనులతో కడకడలాడుతూ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos