ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. సంక్రాంతి తర్వాత నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. కొత్త ఏడాది తొలి రోజునే చాలా పనులకు టెండర్లు పిలిచింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులు మంజూరు చేసింది. అందుకే పనులు వేగం పుంజుకోనున్నాయి. రాజధానిలో చేపట్టే 2,323.25 కోట్ల రూపాయల విలువైన ఐదు కీలకమైన పనులకు సీఆర్డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచాయి.
పలు జోన్లలో మౌలిక వసతుల కల్పన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ టెండర్లు పిలించింది. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్‌ఫ్రా పనుల టెండర్లను ఏడీసీ పిలించింది. జనవరి 22 వరకు టెండర్లు దాఖలు చేసుకోవచ్చు. అదే రోజు నాలుగు గంటలకు టెండర్లు ఖరారు చేయనున్నారు. రహదారుల నిర్మాణంతో పాటుగా నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ టెండర్లు పిలిచారు. అలాగే నీరుకొండ రిజర్వాయర్‌కు సంబంధించిన బ్యాలెన్స్ ఫ్లడ్ మిటికేషన్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. సంక్రాంతి పండుగ లోగా రూ. 31 వేల కోట్ల మేర నిర్మాణాలకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి తన వంతు సహకారం అందిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15000 వేల కోట్లు సాయం ప్రకటించారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీల ద్వారా ఈ మేరకు రుణ సౌకర్యం కల్పించనున్నారు.
అలాగే అమరావతిలో పలు జాతీయ సంస్థలు కూడా కొలువుదీరనున్నాయి. ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే అమరావతి పనులను టీడీపీ కూటమి సర్కారు ప్రారంభించింది. జంగిల్ క్లియరెన్స్ చేపట్టి రాజధానికి ఓ రూపు తీసుకువచ్చింది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos