ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే జాయింట్ కౌన్సిల్ భేటీలో పలు అంశాల పైన చర్చించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి వేళ ప్రతీ ఉద్యోగికి మేలు జరిగేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైమ్‌ షెడ్యూల్‌ నిర్ణయించింది. ఈ మేరకు రానున్న 20 రోజుల సమయంలో ప్రతీ ఉద్యోగికి పదోన్నతి కల్పించేలా విధి విధానాలు ఖరారు చేసారు. అదే సమయంలో ఇక నుంచి ప్రతి ఏటా ఈ షెడ్యూల్‌ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ కచ్చితంగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) విజయానంద్‌ స్పెషల్‌ సీఎస్ లు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల 31 నాటికి డీపీసీలు పూర్తి చేసి, పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. తాజా నిర్ణయం మేరకు ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్‌వోడీలు సచివాలయానికి పంపాలని సూచించారు. 23 నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాల్సిందిగా నిర్దేశించారు. ఇక.. ఈ నెల 29 నాటికి సాధారణ పరిపాలన శాఖ డీపీసీ పూర్తి చేసి, సంబంధిత మినిట్స్‌ను ఆయా సెక్రటరీలకు పంపించేలా షెడ్యూల్ ఖరారు చేసారు.

చివరగా.. ఈ నెల 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో స్పష్టం చేసారు. ఇందు కోసం జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజా ఆదేశాల్లో స్పష్టం చేసారు.ఈ నిర్ణయం ద్వారా ప్రతీ ఉద్యోగికి తన జాబ్ సమయం లో పురోగతితో పాటుగా పదోన్నతి దక్కనుంది. ఇక.. పెండింగ్ డీఏలు.. పీఆర్సీ తో పాటుగా బకాయిల చెల్లింపు విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos