హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న శుక్రవారం రాత్రి ఏపీపీఎస్‌సీ గ్రూప్ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని పక్కన పెట్టింది. క్రీడా కోటా పరిధిలోకి వచ్చే సహాయ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డీఎస్పీ పోస్టులపై కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి 2023 డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదలైంది. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 2025 మే నెలలో మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్‌లో మెయిన్స్ ఫలితాలు ప్రకటించారు. అనంతరం గత ఏడాది జూన్ 23 నుంచి జులై 15 వరకు జనరల్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. క్రీడా కోటాకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఈ ఏడాది జనవరి 7న పూర్తి చేశారు.
ఈ ఎంపిక జాబితాలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ 17, డీఎస్పీ పోస్టులు 25 ఉన్నాయి. అలాగే డీఎస్పీ (జైళ్లు) ఒకటి, డివిజనల్/జిల్లా ఫైర్ సర్వీస్ అధికారి రెండు, ఆర్టీవోలు ఆరు పోస్టులు ఉన్నాయి. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఒకటి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు, డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఆరు, పురపాలక కమిషనర్ (సెకండ్ గ్రేడ్) మూడు పోస్టులు ఎంపికయ్యాయి. సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒకటి, సహాయ ట్రెజరీ అధికారి/సహాయ అకౌంటింగ్ అధికారి మూడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి నాలుగు, సహాయ ఆడిట్ అధికారి రెండు, మండలాభివృద్ధి అధికారి నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు.
పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన షేక్ యూసబ్ సలామ్ తండ్రి సుభానీ ఒక కార్పెంటర్, కనీస వసతులతోనే బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి తన రెండో ప్రయత్నంలో రీజినల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. తెనాలికి చెందిన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు తండ్రి కూరగాయల వ్యాపారి. ప్రస్తుతం సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగేశ్వరరావు, తన లక్ష్యాన్ని వదలకుండా గ్రూప్-1 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. అలాగే అన్నమయ్య జిల్లాకు చెందిన సురేష్ సచివాలయ కార్యదర్శిగా పని చేస్తూనే గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు, అదే ఊపుతో గ్రూప్-1 రాసి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టును దక్కించుకున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన సంతోషి ఒకవైపు తాహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూనే మరోవైపు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యారు. మంగళవారం వచ్చిన గ్రూప్-2 ఫలితాల్లో అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఎంపికైన ఆమె, గ్రూప్-1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు.
గుంటూరుకు చెందిన ప్రియాంక, సాహితి అనే అక్కాచెల్లెళ్ళు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అక్క ప్రియాంక తన మూడో ప్రయత్నంలో గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కాగా, చెల్లెళ్లు సాహితి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-2లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. వాళ్ల తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంపతిరావు శివనాగగౌరి రెండో ప్రయత్నంలో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో ఏఈఈగా పని చేస్తున్నారు. మార్కాపురానికి చెందిన ఒద్దుల వెంకట సుజిత్ రెడ్డి 2023లో ఇంజినీరింగ్ పూర్తి చేసి తన మొదటి ప్రయత్నంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా కొలువు సాధించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos