ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో పరారీలో ఉన్న లిక్కర్ స్కామ్ నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ కార్యాలయంలో లొంగిపోయారు. విదేశాల నుంచి వచ్చిన ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. ఆయనను ఎయిర్ పోర్టులో అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. సిట్ ఆఫీసులో లొంగిపోయేందుకు తానే వస్తానని ముందస్తుగా సమాచారం ఇచ్చి మరీ ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయారు. ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో తప్పనిసరిగా సిట్ ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది.

లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి ఏ-7 గా ఉన్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న రాజ్‌ కసిరెడ్డి కి ఇతను అత్యంత సన్నిహితుడు . వ్యాపార భాగస్వామి కూడా అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. మద్యం సరఫరాదారుల నుంచి కమీషన్ల రూపంలో వసూలు చేసిన కోట్లాది రూపాయల నిధులను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించడంలో ఇతను కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. హవాలా మార్గాల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు విచారణలో తేలింది.

ఈ కేసులో ఇతను చాలా కాలంగా పరారీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత, ఇతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, 2026 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 26 లోపు దర్యాప్తు అధికారి ముందు స్వయంగా హాజరై లొంగిపోవాలని సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు, మరో దారి లేక ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ ముందు లొంగిపోయారు. అవినాష్ రెడ్డిని విచారిస్తే ఈ స్కామ్‌లో ఉన్న మరికొంత మంది రాజకీయ ప్రముఖుల పేర్లు , నిధుల మళ్లింపుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos