2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బడ్జెట్ ను ఇవాళ శనివారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశ పెట్టనున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సుమారు రూ. 3.40 లక్షల కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ముసాయిదాకు మంత్రిమండలి అధికారికంగా ఆమోదం తెలపనుంది.
అనంతరం ఉదయం 11:15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచుతారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12:50 గంటలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రత్యేక పద్దును ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. సాగు నీటి ప్రాజెక్టులు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సారి బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు కోసం భారీగా నిధుల కేటాయింపులు జరగనున్నాయి.
ముఖ్యంగా తల్లికి వందనం, దీపం-2.0, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు బడ్జెట్‌లో సింహభాగం కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఇరుసభలు వాయిదా పడనున్నాయి. ఆదివారం, సోమవారం సభకు సెలవు ప్రకటించారు. తిరిగి మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభమై, బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగుతుంది. మార్చి 7వ తేదీ వరకు సుమారు 17 పని దినాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos