ఏపీ ప్రభుత్వం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో దూసుకెళ్తున్నదని, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన సమస్యలు, గత పాలకులు మిగిల్చిన ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని పేర్కొన్నారు. మరోవైపు ఏపీ గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు. సభ మొదలుకాగానే నిరసనకు దిగిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తూ అదినేత జగన్ తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై, అభివృద్ధి కుంటుపడిందన్నారు. 2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో పాలన సాగుతోందని చెప్పారు. గత 19 నెలల్లో వ్యవస్థలను గాడిలో పెట్టి, 7 శ్వేత పత్రాల ద్వారా పారదర్శకతను తీసుకువచ్చినట్లు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా 10 సూత్రాలతో సుపరిపాలన అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో దూసుకుపోతోందని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలు ఏపీని పెట్టుబడులకు, నాలెడ్జి ఎకానమీకి ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుతో నూతన అధ్యాయం మొదలైందని, ప్రపంచంలోని కొద్ది ప్రాంతాల్లోనే ఉండే ఈ సాంకేతికతను రాష్ట్రంలో స్థాపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
పారిశ్రామిక ప్రగతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ సిటీ వంటివి రాష్ట్ర అభివృద్ధికి కీలకం కానున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏటా రూ. 33 వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా వివిధ డీబీటీ (DBT) పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్టీఆర్ భరోసా ద్వారా 63.12 లక్షల మందికి పెన్షన్లు, తల్లికి వందనం కింద 66 లక్షల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీశక్తి, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం 2.0 పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. అన్నదాత సుఖీభవ ద్వారా 46.86 లక్షల మంది రైతులకు రూ. 20 వేల చొప్పున లబ్ధి చేకూరుతోంది. నిరుద్యోగ నివారణకు మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. పేదరికం లేని సమాజ స్థాపనే (Zero Poverty) లక్ష్యంగా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. త్వరలోనే ప్రతి కుటుంబానికి 'ఫ్యామిలీ డిజిటల్ కార్డు' అందించేందుకు కసరత్తు జరుగుతోంది.
పీ4 (P4) విధానం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆకలి లేని రాష్ట్రం కోసం 113 నియోజకవర్గాల్లో 205 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు, త్వరలో గ్రామీణ ప్రాంతాలకు వీటిని విస్తరిస్తారని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos