ఆంధ్రప్రదేశ్ నుండి జూన్‌లో ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలపై తెలుగుదేశం పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వానికి ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లు సులువుగా దక్కే అవకాశం ఉండటంతో, అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలుపెట్టారు. ఈ రేసులో ప్రస్తుతం టీడీపీ ఐటీ వింగ్ బాధ్యతలు చూస్తున్న యువనేత చింతకాయల విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఎంపీ సీటు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది.
టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది అధిష్టానం ఆలోచన. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేతగా, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారసుడిగా విజయ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్‌గా గౌరవప్రదమైన హోదాలో ఉండగా, ఆయన కుమారుడికి ఢిల్లీ స్థాయిలో అవకాశం కల్పించడం ద్వారా ఉత్తరాంధ్రలోని బీసీలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఐటీ వింగ్‌పై అనేక కేసులు నమోదైనప్పుడు విజయ్ వెనకడుగు వేయకుండా పోరాడారు. పార్టీ సోషల్ మీడియా సైనికులకు అండగా నిలవడమే కాకుండా, ప్రభుత్వంపై నిరంతరం డిజిటల్ అస్త్రాలను సంధించారు. ఈ క్రమంలో ఆయన అనేక రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పార్టీ కోసం ఆయన పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ గౌరవం దక్కాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత చంద్రబాబు దృష్టిలో కూడా విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అన్నీ అనుకూలిస్తే .. రాజ్యసభలో టీడీపీ తరపున చింతకాయల విజయ్ అడుగు పెట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కిలారు రాజేష్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. లోకేష్ వ్యక్తిగత బృందంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే, సీనియర్ నేత వర్ల రామయ్య పేరు ప్రతిసారి చర్చకు వస్తూనే ఉంది. దళిత సామాజికవర్గం నుండి బలమైన గొంతుకగా, పార్టీ స్టాండ్‌ను టివి చర్చల్లో సమర్థవంతంగా వినిపించే ఆయనకు ఈసారి అవకాశం దక్కుతుందో లేదోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన మహాసేన రాజేష్ పేరు కూడా కొన్ని వర్గాల్లో పరిశీలనకు వస్తోంది. మొత్తానికి పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు ఎత్తగల చదువుకున్న యువతను పంపాలని లోకేష్ , చంద్రబాబు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos