ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే అత్యంత విశిష్టమైన ‘కాకడ హారతి’ కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు కోపర్‌గావ్ ఎమ్మెల్యే, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు. దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి బాబా వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని సాయినాధుడిని ప్రార్థించినట్లు మంత్రి నారా లోకేష్ దంపతులు పేర్కొన్నారు. సాయిబాబా సన్నిధిలో ఆధ్యాత్మికంగా సమయం గడపడంపై దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos