ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్‌లో రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. శాసనమండలిలో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే వైసీపీ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి లోకేష్ సరదాగా మాట్లాడుకున్నారు. రెండు నిమిషాల పాటు వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ ఎకోసిస్టమ్ లో కొద్దో గొప్పో మర్యాదా మన్నన తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే .. మొదట వినిపించే పేరు బొత్స సత్యనారాయణ. రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా ఆయన ప్రత్యర్థి పార్టీల నేతలతో సైతం సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తారు. శాసనమండలిలో ఇటీవల బొత్స సత్యనారాయణ పవన్ కల్యాణ్ ను పలకరించి, ఆయనతో సంభాషించారు. వారిరువురూ కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో వైసీపీలో తీవ్ర కలకలం సృష్టించింది. బొత్స జనసేన గూటికి చేరుతారా అన్న చర్చ కూడా జరిగింది. అయితే రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అన్నట్లుగా బొత్స తన తీరుతో చాటారు.  ఇప్పుడు తాజాగా బొత్స.. మంత్రి లోకేష్ తో కొద్ది సేపు సంభాషించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇలా తమ పార్టీ నేతలు ప్రత్యర్థులతో మాట్లాడటం అసలు నచ్చదు. రాజకీయ ప్రత్యర్థులు అంటే వ్యక్తిగత శత్రువులేనని వారితో కలిసి మాట్లాడినా ఆయన ఊరుకోరు. వాళ్లని నమ్మలేని నేతల కేటగిరీలోకి చేర్చేస్తారు. ఈ విషయం బొత్స సత్యనారాయణకు బాగా తెలుసు. అయినా సరే ఆయన పట్టించుకోలేదు. గతంలో పవన్ కల్యాణ్ .. సెక్రటేరియట్ లో దూరంగా కనిపిస్తే పరుగెత్తుకుంటూ వెళ్లి పలకరించిన విధంగానే.. ఇప్పుడు నారా లోకేష్ తో తనకు ఎంతో మంచి ర్యాపో ఉందన్నట్లుగా మాట్లాడేశారు.

మరోవైపు బొత్స సత్యనారాయణ తీరు కాస్త అనుమానాస్పదంగా ఉందని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు. శాసనమండలిలో ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని, బిల్లులు ఆపడం లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్, లోకేష్‌లతో సరదాగా మాట్లాడుతూండటం మరిన్ని అనుమానాల్ని రేకెత్తించేలా ఉంది. అయినా బొత్స మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు.  మొత్తం మీద లోకేష్ తో బొత్స భేటీ పరిణామాలు వైసీపీలో ఏ విధంగా ఉంటాయన్నది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos