రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని భోగి వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాస్‌బుక్‌లను ఆయన భోగి మంటల్లో వేశారు. కేశినేని చిన్ని నిర్వహించిన భోగి కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బొమ్మలను తొలగించి, అసలు రాజముద్రతో పాస్‌బుక్‌లు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్‌బుక్‌లను కాల్చేశామని చెప్పారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన జీవోలను కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని, ఇప్పుడు వైసీపీ నేతలే వాటిని భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత సర్కార్‌లో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలు చాలా కష్టాలు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు.

మరోవైపు అనకాపల్లి జిల్లా నర్నీపట్నంలో జరిగిన భోగి సంబరాల్లో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నక్కలపల్లిలో హోంమంత్రి అనిత డప్పు వాయించి సందడి చేయగా చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గో పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఏర్పాటు చేసిన కేరళ డప్పులను హోంమంత్రి కొద్దిసేపు వాయించి అందరిలో ఉత్సాహం నింపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పెదఅమిరంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున భోగి సంబరాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి నారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos