విశాఖపట్నం నగర వాసుల దశాబ్దాల కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీ ఐటీ రాజధానిగా ఎదుగుతున్న విశాఖకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండగా, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం, విశాఖ మెట్రో నిర్మాణానికి ఆమోదం తెలపడంతో ఉత్తరాంధ్రలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు విడుదల కానుండటంతో, విశాఖపట్నం త్వరలోనే మెట్రోపాలిటన్ నగరాల సరసన చేరనుంది.
ఈ భారీ ప్రాజెక్టును దాదాపు రూ. 11,000 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 46.22 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. మొత్తం మూడు కారిడార్లలో 42 స్టేషన్లతో ఈ మెట్రో పట్టాలెక్కనుంది. మొదటి కారిడార్ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్ల పొడవునా, 29 స్టేషన్లతో అత్యంత కీలకమైన మార్గంగా ఉండబోతోంది. అలాగే గురుద్వారా నుండి పాత పోస్టాఫీసు వరకు రెండో కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు మూడో కారిడార్‌ను నిర్మించేలా డీపీఆర్‌ను సిద్ధం చేశారు.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టును డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో రైలు అధికారులు కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం, అక్టోబర్ నెల నుంచే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే విశాఖ ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, పారిశ్రామికంగా నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos