ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో ఇంటి నిర్మాణ పనులకు ఇవాళ ఉదయం 8.51 గంటలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇంటిని 1,455 చ.గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1లో నిర్మించి.. త్వరగా పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. శంకుస్థాపన కూడా పూర్తి కావడంతో పనులు వేగవంతం చేయనున్నారు.
గత ఏడాది 2024 డిసెంబరులో వెలగపూడికి చెందిన రైతు నుంచి చంద్రబాబు 5 ఎకరాల నివాస స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ వెంటనే భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు.. ఇక్కడ మొత్తం 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1 (G+1) ఇంటిని నిర్మించనున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి కడతారు.. ఈ స్థలంలో ఎక్కువ భాగం గ్రీనరీ కోసం కూడా కేటాయించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు.
చంద్రబాబు నాయుడికి హైదరాబాద్‌తో పాటుగా సొంత ఊరైన నారావారిపల్లెలో సొంత ఇళ్లు ఉన్నాయి. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సొంత ఇల్లు లేదు.. అలాగే రాజధాని అమరావతిలో కూడా ఇల్లు లేదు. గతంలో 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్నారని.. చంద్రబాబుకు మాత్రం కుప్పంలో, అమరావతిలో ఇల్లు లేదని ఆ పార్టీ నేతలు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇప్పటికే ఇల్లు నిర్మిస్తున్నారు.. ఆ ఇంటి నిర్మాణం కూడా ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు అమరావతిలో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు.
సీఎం క్యాంప్ కార్యాలయం, నివాసంతో పాటు కారు పార్కింగ్, నౌకర్లు, భద్రతా సిబ్బందికి కూడా గదులు ఉండేలా నిర్మాణం ఉంటుందని భావిస్తున్నారు. నారా భువనేశ్వరి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం జరగనుంది. భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని, దానికి కృతజ్ఞతగా పట్టువస్త్రాలు సమర్పించామని రైతులు చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నందుకు వెలగపూడిలోని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos