ఏప్రిల్ 20వ తేదీ అంటే మరో మూడు రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి 75వ వజ్రోత్సవ జన్మదినం వస్తోంది. అయితే కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ఇది ఒక అరుదైన అవకాశమని చంద్రబాబు భావిస్తున్నారు. 75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా యూరప్ పర్యటనకు సీఎం కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.
విదేశీ పర్యటనలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని తిరిగి ఏప్రిల్ 21వ తేదీ అర్ధరాత్రి అమరావతికి చేరుకుంటారు. గత 10 నెలలుగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి వేగాన్ని అందుకోవడం కోసం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలన ప్రారంభమైన తర్వాత ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. వయసు 75 అయినా, వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతున్న చంద్రబాబు.. ఈసారి వ్యక్తిగత క్షణాలను కుటుంబంతో గడిపేందుకు ప్రయాణిస్తున్నారు. జన్మదినం వేడుకలను రాజకీయ హడావుడి కాకుండా వ్యక్తిగతమైన అనుభూతిగా మార్చుకోవడంలో ఆయన చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తారు.
చంద్రబాబునాయుడు 1950, ఏప్రిల్ 20వ తేదీన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఖర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. ఈయనకు ఒక సోదరుడు రామ్మూర్తి నాయుడు. ఆయన ఇటీవల మృతి చెందారు, ఇద్దరు సోదరీ మణులు ఉన్నారు. సోదరీ మణుల వివరాలు పెద్దగా ప్రచారంలో లేవు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు అనతికాలంలోనే విజయాలు దక్కించుకున్నారు.
తొలుత కాంగ్రెస్‌లో చేరిన చంద్రబాబు.. తొలినాళ్ళలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే.. చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన తరువాత.. టీడీపీలో చేరి.. అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఏపీలో కూటమి సర్కారును సమర్థవంతంగా నడిపిస్తున్నారని జాతీయస్థాయి నాయకులతో ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. 24 ఏళ్ల యువకుడిగా.. నిత్యం 18 గంటల పాటు పనిచేసేందుకు ఇష్టపడడం నేటి యువతకు రాజకీయాలకు అతీతంగా స్ఫూర్తిదాయకమని మేధావులు అంటున్నారు. విద్యార్థి దశ నుంచే చంద్రబాబుకు రాజకీయాలపై ఆసక్తి ఉండేది. చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరారు.
చంద్రబాబు నాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.1980- 1983 వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తారు. అదే సమయంలో 1981 సెప్టెంబర్ 10న ఎన్టీ రామారావు మూడవ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది టీడీపీ. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మామ నందమూరి రామారావు పిలుపు మేరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనులు, శిక్షణ శిబిరాలను నిర్వహించడం, సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించడంలో నిమగ్నమయ్యారు.
నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో 1984 ఆగస్టు సంక్షోభం సమయంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు . ఎన్టీఆర్ 1986లో చంద్రబాబును టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు పోటీ చేసి 5 వేల ఓట్లతో గెలుపొందారు. ఇక 1994 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొంది ..ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక, రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1995 న చంద్రబాబు నాయుడు..ఎన్టీ రామారావు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి వివాదాస్పద పాత్ర కారణంగా అంతర్గత తిరుగుబాటు చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు మెజారిటీ శాసనసభ్యుల మద్దతును పొందగలిగారు.1999 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తన పార్టీని విజయపథంలో నడిపించారు. రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లలో 180 స్థానాలు సాధించారు. అదనంగా పార్లమెంటు ఎన్నికలలో 42 స్థానాలకు గాను 29 స్థానాలను టీడీపీ గెలుచుకుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ విజయం సాధించింది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ చేతిలో ఓడిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏపీ పాలన పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos