భారత మహిళల క్రికెట్ జట్టు సగర్వంగా నిలిచిన ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రీడాకారిణి శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా హాజరైంది. అమరావతిలోని తమ నివాసానికి శ్రీచరణి, మిథాలీ రాజ్‌లను ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించడంలో భాగమైన శ్రీచరణిని అభినందించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... "శ్రీచరణి సాధించిన ఘనత భారత మహిళల శక్తికి, స్ఫూర్తికి నిజమైన నిదర్శనమని, ఆమె భవిష్యత్ తరాల యువ అథ్లెట్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని" ప్రశంసించారు. ఈ మేరకు ఆయన #APWelcomesShreeCharani అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం అమరావతిలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన ఆమెను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీచరణి, మిథాలీ రాజ్‌కు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సాదర స్వాగతం పలికారు. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించారు. శ్రీచరణితో ముఖ్యమంత్రి సెల్ఫీ దిగారు. అనంతరం ‘ఎక్స్’లో స్పందిస్తూ.. "విన్నర్‌గా నిలిపిన స్పిన్నర్‌తో సెల్ఫీ" అని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా, యర్రమల పల్లె అనే చిన్న గ్రామానికి చెందిన శ్రీచరణికి ఇదే తొలి ప్రపంచకప్. ఈ టోర్నీలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా అద్భుతంగా రాణించి 14 వికెట్లు పడగొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై కూడా 10 ఓవర్లలో 49 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ క్రికెటర్ అయిన తన మామయ్య కిశోర్ కుమార్ రెడ్డి వద్ద శ్రీచరణి శిక్షణ పొందింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos