అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శుక్రవారం హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సులో భాగంగా శుక్రవారం ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొంటారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది.
ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రెండే తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు.
అనంతరం ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ, ఆన్ లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క నారాయణ్, భారత్ లో యూకే హై కమిషనర్ లిండి కెమరాన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సెలర్ శాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ తరువాత అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే తో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారని అధికారులు వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos