ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి, వారిని ఆప్యాయంగా పలకరించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వారి యోగక్షేమాలను విచారించి, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముగ్గురు లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పింఛన్లు అందించారు. ముఖ్యమంత్రే నేరుగా తమ ఇంటికి వచ్చి పింఛను అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడంలో భాగంగా సీఎం ఈ కార్యక్రమం చేపట్టారు.
మరోవైపు శనివారం సాయంత్రం 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. వీటి ద్వారా రూ.675.24 కోట్ల పెట్టుబడులు, సుమారు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రూ.200 కోట్లతో ఎంఏఎఫ్ క్లాతింగ్, రూ.180 కోట్ల పెట్టుబడితో న్యూట్రీ ఫీడ్స్, రూ.137.1 కోట్ల పెట్టుబడితో ఇన్-ఫేజ్ వరల్డ్ పార్క్ వంటి సంస్థలు కుప్పం కేంద్రంగా పరిశ్రమలు స్థాపించనున్నాయి. ఇవే కాకుండా మరో నాలుగు కంపెనీలతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. ఇక కుప్పం నియోజకవర్గాన్ని ‘నెట్ జీరో’గా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు, సుర్బానా జురాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్ స్టాండ్ డిజైన్లను సీఎం సమీక్షిస్తారు. ఇక ఆదివారం పర్యటన చివరి రోజున పార్టీ కేడర్ సమావేశం కానున్నారు. అలాగే కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథార్టీ అడ్వైజరీ కమిటీతో సమావేశమై… నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష చేపట్టనున్నారు. ఆదివారం సాయంత్రం మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రి కుప్పం నుంచి అమరావతికి తిరిగి పయనం అవుతారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos