అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణ సమయం లోనే సీఆర్డీఏ కొత్త ప్రణాళికలు అమలు చేస్తోంది. రెండోవిడత భూసమీకరణ ప్రక్రియ ముగిసిన తరువాత మాస్టర్ ప్లాన్ విస్తరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించనున్నారు. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగురోడ్డుకు ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ఇన్నర్ రింగురోడ్డు నిర్మాణమూ చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లను రెండోదశ పూలింగ్ ప్రాంతానికి విస్తరించనున్నామని, వీటిని ఔటర్ రింగ్ కు అన్నివైపులా కలిపేలా ప్లానింగ్ ఉందని వెల్లడించారు.
తాజా ప్రతిపాదనల మేరకు తూర్పున 16వ నెంబరు జాతీయ రహదారి హద్దుగా దక్షిణం, పడమర ప్రాంతంలో ఔటర్ రింగురోడ్డు, ఉత్తరాన కృష్ణానది ప్రాంతం మధ్యలో పూర్తిగా ప్లానింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. దాదాపుగా సీఆర్‌డీఏ రీజియన్ ప్రాంతం మొత్తం సమగ్ర ప్లానింగ్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ ప్రాంతం సుమారు 8352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంటే సుమారుగా 20.88 లక్షల ఎకరాలకు విస్తరించి ఉంది. దీనిలో కనీసం మూడు లక్షల ఎకరాల పరిధిలోకి రాజధాని ప్లానింగ్ ఏరియా పెరుగుతుందనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 16వ నెంబరు జాతీయ రహదారికి ఈ3, ఈ5 రోడ్లను కలపనున్నారు. ఈ3 రోడ్డును రెండోదశ ల్యాండ్ పూలింగ్ పరిధి వరకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. సమీకరణ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీ పూర్తి చేసిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పనిలో పనిగా మొత్తం ఔటర్‌రింగ్ రోడ్డుకూ అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.
కాగా, ఇన్నర్ రింగురోడ్డు, ఔటర్ రింగురోడ్డుకు మధ్యలో అభివృద్ధికి అవసరమైన ప్లానింగ్ చేయాలని తొలి మాస్టర్ ప్లాన్ ఖరారు వేళ నిర్ణయించారు. రాజధాని చుట్టుపక్కల ఏడు ప్రాంతాలను పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలుగా గుర్తించారు. రింగురోడ్లను కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేశారు. గుడివాడ, గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి, కంచికచర్ల, కంకిపాడు, ఉయ్యూరు పరిసరాల్లో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలనూ ఏర్పాటు చేయాలనేది అప్పటి ప్రతిపాదన. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా గుడివాడ, ఆహ్లాద, పర్యాటక ప్రాంతంగా తెనాలి, లాజిస్టిక్ కేంద్రంగా గన్నవరం ప్రాంతాలను అప్పట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం మాస్టర్‌ప్లాను రూపొందించాలనే మంత్రి ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos