ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో సాగిస్తున్న ఆస్తుల యుద్ధం కేవలం కోర్టు గదులకే పరిమితం కాలేదు. అది సగటు ఆంధ్రుడి ఇంటి గుమ్మం దాటి చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రత్యర్థులను ప్రయోగించే వ్యూహాన్ని, సొంత రక్తసంబంధీకులపై ప్రయోగించడం జగన్ రాజకీయ ప్రస్థానంలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం గా కనిపిస్తోంది. మాట తప్పను.. మడమ తిప్పను అనే నినాదంతోనే జగన్ రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కానీ, తల్లి విజయమ్మ దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ఆ నినాదంలోని డొల్లతనాన్ని ఎండగట్టింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు వారసుడినని చెప్పుకునే జగన్, అదే తండ్రి రాసిచ్చిన పత్రాలను, కుటుంబ ఒప్పందాలను ధిక్కరించడం ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒక కొడుకుగా తల్లిని కోర్టు మెట్లు ఎక్కించడం, చెల్లికి దక్కాల్సినవి ఇవ్వకుండా వేధించడం, పైగా కోర్టుకెళ్లడం వంటి చర్యలు తెలుగు సమాజం జీర్ణించుకోలేని అంశాలు. సెంటిమెంట్లకు ప్రాణమిచ్చే గ్రామాల్లో కన్నతల్లికి కన్నీళ్లు మిగిల్చే నాయకుడు.. మనకేం న్యాయం చేస్తాడనే ప్రశ్న ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అక్కా.. చెల్లెమ్మ అంటూ ప్రతి వేదికపై మమకారం ఒలకబోసిన జగన్, ఇప్పుడు తన సొంత చెల్లి షర్మిలకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు నిరాకరించడం అతిపెద్ద వైరుధ్యం . రాజకీయ ప్రత్యర్థులు దీనిని ఒక బలమైన అస్త్రంగా మలుచుకుంటున్నారు.
సంక్షేమ పథకాల ద్వారా మహిళా పక్షపాతిగా ముద్ర వేయించుకోవాలని చూసిన జగన్ ఇమేజ్‌ను, ఈ కుటుంబ కలహం పూర్తిగా డ్యామేజ్ చేస్తోంది. సామాన్య మహిళలకు ఇచ్చే భరోసా కంటే, తన రక్తసంబంధీకురాలికి ఇవ్వాల్సిన ఆస్తి హక్కు ముఖ్యం కాదని ఆయన ప్రవర్తన సూచిస్తోందనే భావన పెరుగుతోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య కాదు, జగన్ వ్యక్తిత్వంలోని కఠినత్వాన్ని ప్రజల ముందు ఆవిష్కరించిన ఉదంతంగా మారుతోంది. జగన్ తన ఈగో ను పక్కన పెట్టి, పట్టువిడుపులతో ఈ సమస్యను ఇంటి నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అనుకోవచ్చు. చరిత్రలో ఎందరో నాయకులు తమ అహంకారం వల్ల సామ్రాజ్యాలను కోల్పోయారు. జగన్ కూడా అదే బాటలో సాగితే, భవిష్యత్తులో ప్రజలు ఆయనను ఒక నాయకుడిగా కంటే, కుటుంబ సభ్యులను వేధించిన వ్యక్తిగానే గుర్తుంచుకుంటారన్న అభిప్రాయం క్యాడర్ లో వ్యక్తమవుతోంది. కానీ జగన్ మాత్రం దీన్ని గుర్తించలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos