సమాజంలో పోలీసులు అంటే కేవలం డ్యూటీలో ఉన్నప్పుడే బాధ్యతగా ఉంటారనే భావనను పటాపంచలు చేస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనిని ఇప్పుడు అందరు మెచ్చుకుంటున్నారు. విధి నిర్వహణలో లేకపోయినా ఓ సామాన్యుడి ప్రాణాలను కాపాడి, ఆపదలో ఆదుకున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతి ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖకు రోల్ మోడల్‌గా నిలిచారు. కానిస్టేబుల్ జయశాంతి చేసిన సాహసానికి ముగ్దురాలైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఫోన్ చేసి ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు. విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి కొనియాడారు.
మీ లాంటి వారు ఉండటం వల్లే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, యూనిఫామ్‌లో లేకపోయినా.. సమాజం పట్ల ఒక పౌరురాలిగా జయశాంతి చూపిన చొరవ అద్భుతమని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ వివరాలను, వారి యోగక్షేమాలను కూడా మంత్రి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రిని నేరుగా కలవాలని జయశాంతి తన మనసులోని కోరికను తెలపగా.. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. "తప్పకుండా త్వరలోనే నిన్ను కలుస్తాను.. మనందరం కలిసి పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచుదాం" అని హామీ ఇచ్చారు. మంత్రి అనిత కేవలం ఫోన్ చేయడమే కాకుండా, తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కూడా జయశాంతిని అభినందిస్తూ పోస్ట్ చేశారు."పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతిఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం." అని ఆమె పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే... కాకినాడలోని కెనాల్ రోడ్డులో జనవరి 17 శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సామర్లకోట వైపు నుంచి కాకినాడ వైపు వస్తున్న లారీ.. రైల్వే గేటు వద్ద నిలిచిపోయింది. రోడ్డు మధ్యలో లారీ ఆగిపోవటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారుగా ఐదు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ జామ్‌లో రెండు అంబులెన్సులు చిక్కుకుపోయాయి. అలాగే పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణి కూడా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. సుమారుగా గంట పాటు ఇదే పరిస్థితి నెలకొంది.
ఇదే సమయంలోనే లేడీ కానిస్టేబుల్ జయశాంతి రంగంలోకి దిగింది. రంగంపేటలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జయశాంతి.. తన డ్యూటీ సమయం పూర్తైనప్పటికీ.. సామాజిక బాధ్యతతో వ్యవహరించి ట్రాఫిక్ క్లియర్ చేసింది. అంబులెన్సును బయటకు తీసుకురావటం కోసం చంటిబిడ్డను భుజాన వేసుకుని మరీ ట్రాఫిక్ క్లియర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు లేడీ కానిస్టేబుల్ జయశాంతిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైతం కానిస్టేబుల్ జయశాంతిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఓ చేతితో మాతృత్వాన్ని. మరో చేతితో కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos