అమరావతిలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఎంఎస్‌కే ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల్లో ఈ ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ సముదాయం ఏర్పాటు కానుంది. స్థానిక క్రికెటర్లలో ప్రతిభను పెంపొందించడంతో పాటు అమరావతిలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ అకాడమీలో ఆధునిక క్రికెట్ మైదానం, సాధన మైదానాలు, 400 మంది క్రీడాకారుల సామర్థ్యాన్ని విశ్లేషించే ట్రైనింగ్ సెంటర్ ఉంటాయి.

1,000 మంది విద్యార్థులు చదువుకునేలా అంతర్జాతీయ స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్లేయర్లు, టీమ్‌ల కోసం వేర్వేరుగా హాస్టల్స్, అత్యాధునిక జిమ్‌లు, ఫిజియోథెరపీ, పునరావాస కేంద్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇండోర్, అవుట్‌డోర్ ట్రైనింగ్ జోన్లు, ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు కూడా ఈ క్రీడా సముదాయంలో ఉంటాయి. అమరావతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాలతో పాటు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేస్తోంది. ఈ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే భూములను కేటాయించింది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కోసం అమరావతిలో 12 ఎకరాల భూమిని కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని కూడా అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద అమరావతిలో స్పోర్ట్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది ఏపీ ప్రభుత్వం.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos