బెంగళూరు: యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్ ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బెంగళూరు సర్జాపూర్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలోని గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ(ఐబీ డిప్లమా ప్రోగ్రామ్) గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో(2026) మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు కేవలం గ్రాడ్యుయేషన్ డే వేడుక మాత్రమే కాదు. జ్ఞాపకాలు కలలను కలిసే చోటు, విద్యార్థులు భవిష్యత్ నాయకులుగా మరే ప్రత్యేకమైన క్షణం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి పాఠశాల బృందం వచ్చినప్పుడు.. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ థీమ్ ‘కొత్త అవకాశాలకు నాంది పలకడం’(Pioneering Possibilities) అనే థీమ్ ను విద్యార్థులే ఎంచుకున్నారని చెప్పడం నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది. ఇది చాలు మీరేంటో చెప్పడానికి. ఎందుకంటే ఇది కేవలం థీమ్ మాత్రమే కాదు.. ఒక ఆలోచనా విధానం. మీలో ఉన్న ధైర్యాన్ని, జిజ్ఞాసను ప్రతిబింబిస్తోంది. 

గ్రీన్ ఉడ్ హై సంస్థ గ్లోబల్ సిటిజన్స్ ను తయారుచేస్తుండటం గర్వకారణం

గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ వంటి సంస్థలను నిర్మించడంలో సత్వా గ్రూప్‌ పాత్ర అభినందనీయం. ఈ రోజు సత్వా గ్రూప్ ఏపీ, విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోంది. అలా ఈ అనుబంధం ప్రారంభమైంది. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఈ క్యాంపస్‌ను, మీ మౌలిక సదుపాయాలను, మీ విజయాలను, మీ ప్రపంచ దృష్టిని చూసినప్పుడు.. గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ వంటి సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో గ్లోబల్ సిటిజన్స్ ను తయారు చేస్తున్నాయని గర్వంగా అనిపిస్తోంది. 

ఏం నేర్చుకున్నారన్నది కాదు.. ఎలా ఆలోచిస్తున్నారనేది ముఖ్యం

ఇక్కడకు రావడం వల్ల నా పాత రోజులు గుర్తుకువస్తున్నాయి. నేను కార్నెగీమెలన్ యూనివర్సిటీలో, తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాను. అవి కలలు, ఆశయాలు, అనిశ్చితితో నిండిన రోజులు. కానీ నేను ఎంతో స్పష్టంగా నేర్చుకున్న ఒక విషయం ఉంది. విద్య అనేది మీరు ఏం నేర్చుకుంటారన్నది మాత్రమే కాదు. మీరు ఎలా ఆలోచించడం నేర్చుకుంటారన్నదే ముఖ్యం. అదే విషయం నాకు ఇక్కడ కూడా కనిపిస్తోంది. పరీక్షల కోసం మాత్రమే కాదు, జీవితానికి సిద్ధం చేసే ఒక విధానం. 

ట్రెండ్ ను అనుసరించకుండా లక్ష్యంపై దృష్టిపెట్టాలి
 
మీలో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, కావాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల వైపు చూస్తున్నారు? ఎంతమంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారు? మీరు ఏ దారిని ఎంచుకున్నా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ట్రెండ్స్‌ను అనుసరించకండి, మీ లక్ష్యాన్ని అనుసరించండి. ఎందుకంటే ట్రెండ్స్ మారిపోతాయి… కానీ లక్ష్యం మాత్రం నిలిచే ఉంటుంది. ఎప్పుడూ ఇతరులు నడవని దారినే ఎంచుకోండి.

యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలి

మీరు నన్ను ఈ రోజు ఒక మంత్రిగా చూస్తున్నారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2017-19 వరకు నేను పంచాయతీరాజ్, ఐటీ & ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశాను. ఒక గదిలో కూర్చొని నిర్ణయం తీసుకుంటే.. ఎక్కడో దూరంగా ఉన్న గ్రామంలో, ఎవరో ఒకరి జీవితం మారిపోతుంది. అదే రెస్పాన్స్ బులిటీ పవర్. ఒక్కోసారి జీవితం మనల్ని పరీక్షిస్తుంది కూడా. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాను. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం అది. ఆ సవాల్ ను స్వీకరించా. కానీ ఓడిపోయా. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుని ముందుకు సాగాను. 2023లో ఏపీ వ్యాప్తంగా 3,132 కిలోమీటర్లకు పైగా యువగళం పేరుతో పాదయాత్ర చేశా. ఏడాదిపాటు గ్రామాలు, పట్టణాలు, పొలాలు, వీధుల్లో నడిచా. రైతులు, మహిళలు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మెకానిక్‌ లను కలిశా. ఆ ప్రయాణం నన్ను పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు పాలనను వ్యవస్థ దృష్టితో చూశా. కానీ ఆ ప్రయాణంలో జీవితాన్ని ప్రజల దృష్టితో చూశా. ఆ రెండు చాలా భిన్నమైనవి. తర్వాత మరో అధ్యాయం ప్రారంభమైంది.

మంగళగిరిలో గెలుపు ప్రజల నమ్మకానికి నిదర్శనం

2024లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేశా. అదే మంగళగిరి, అదే ప్రజలు. కానీ ఈసారి మరింత లోతైన అవగాహన, మరింత బలమైన నమ్మకంతో వెళ్లి విజయం సాధించాం. గెలవడమే కాదు… మంగళగిరిలో 91,413 ఓట్ల మెజారిటీ సాధించాం. ఇది రాష్ట్రంలో మూడో అత్యధిక మెజారిటీ. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో ఇది జరిగింది. ఆ విజయం నాది కాదు. ప్రజల నమ్మకానికి నిదర్శనం. వినడానికి చేసిన ప్రయత్నానికి ఫలితం. ప్రజలతో నిజాయితీగా మమేకమైనప్పుడు మార్పు తప్పకుండా వస్తుందని నిరూపించింది.

ప్రపంచ పౌరులను తయారు చేసే పాఠశాల ఇది

ఈ రోజు తల్లిదండ్రుల రోజు కూడా. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక త్యాగం, సహనం, నిస్వార్థమైన మద్దతు ఉంటుంది. ఉపాధ్యాయులు భవిష్యత్త్ నిర్ణేతలు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితాలను తీర్చిదిద్దుతారు. గ్రీన్‌వుడ్ హై ఒక అద్భుతమైన సంస్థను నిర్మించింది. జ్ఞానం, జీవన నైపుణ్యాలు, మీలాంటి ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రపంచ పౌరులను తయారు చేసే పాఠశాల ఇది. ఈ రోజు డిప్లొమాను అందుకునే విద్యార్థులు.. రేపు మీరు మీ బాధ్యతను అందుకుంటారు. మీ కుటుంబం, సమాజం, దేశం పట్ల బాధ్యతగా ఉండాలి. మీరు ముందుకు సాగే క్రమంలో మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. పెద్ద కలలు కనండి, కానీ నేల మీదే ఉండండి. కష్టపడండి, కానీ నైతిక విలువలను విస్మరించవద్దు. విజయాలు సాధించండి కానీ ఇతరులను కూడా మీతో తీసుకెళ్లండి. ఎందుకంటే నిజమైన విజయం అనేది మీరు ఒంటరిగా సాధించేది కాదు.. ఇతరులకు మీరు సృష్టించే అవకాశమే. 2026 బ్యాచ్ విద్యార్థులు కేవలం గ్రాడ్యుయేట్లు మాత్రమే కాదు... మార్గదర్శకులు. అడ్డంకులను ఛేదించి ముందుకు  సాగాలని  ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos