ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం అమరావతి. ఈ విషయంలో వైఎసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో... కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ఇవాళ ఏప్రిల్ ఒకటి బుధవారం లోక్ సభలో ప్రవేశ పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీ నేతలు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు. తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
జగన్ .. తన హయాంలో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడు ముక్కలాట కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకపోవడం వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు పార్టీ నేతలు వాపోతున్నారని సమాచారం. అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అమరావతి అంశంలో ఇకనైనా జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని మెజారిటీ వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారని పార్టీ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos