టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ భూ కబ్జా వ్యవహారంపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలోని మదనపల్లె పరిధిలో జరిగిన భూ ఆక్రమణ కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బి.కె. పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 8/1లో ఉన్న 2.92 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ ఆక్రమించినట్టు వచ్చిన ఫిర్యాదు నిజమని తేలింది. ఈ భూమి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొమ్మలపాటి రమేశ్, ఆయన భార్య సరళ పేరున నకిలీ పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు స్పష్టమైంది. కలెక్టర్ నివేదికలో సంచలన అంశాలు నమోదు అయ్యాయి. అప్పటి తహశీల్దార్ శివరామిరెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్వో, వీఆర్ఏలు మాజీ ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఈ అక్రమానికి సహకరించినట్టు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, సెలవు రోజైన ఆదివారం నాడు తహశీల్దార్ రికార్డులు మార్చినట్టు కూడా రిపోర్టులో వెల్లడైంది.

ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఏపీ భూ ఆక్రమణ చట్టం కింద మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్, ఆయన భార్యతో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై లోకాయుక్త కోర్టు సీరియస్‌గా స్పందించడంతో భూ కబ్జాలు, అక్రమ కార్యకలాపాలపై పోలీసులు నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇకపై చెరువు పోరంబోకు భూములు, ప్రభుత్వ కేటాయింపుల స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos