విజయవాడ : సమిష్టి భాగస్వామ్యంతో విజయవాడ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర ఇతర అధికారులతో కలిసి మంగళవారం పట్టణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రధాన ప్రాంతాలు, శివారు, కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేషన్ కు ఆదాయం తెచ్చే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. రాబడి పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పన్నులు ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరిని ఉపేక్షించకూడదని నిక్కచ్చిగా పన్నులు వసూలు చేయాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ ను స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే సుజన చౌదరి మాట్లాడుతూ.. విజయవాడ నగర అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించడంతోపాటు రోడ్లు, రైల్వే బ్రిడ్జిలు,శానిటేషన్, స్మార్ట్ టాయిలెట్లు ,స్ట్రామ్ వాటర్ డ్రైయిన్ల ఏర్పాటు తో పాటు ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ వంటి పలు సుందరీ కరణ కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి బాధ్యతగా బకాయి దారులంతా సహకరించాలని కమిషనర్ తెలియజేశారు. బకాయి దారుల నుంచి రావాల్సిన మొండి బకాయిలను వసూలు చేయాలని సంబంధిత విభాగం అధికారులను కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. పన్నుదారులంతా క్రమం తప్పకుండా తమకు చెందిన ఆస్తి పన్నులను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos