ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పంట కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు. భారత వాతావరణ శాఖ - ఐఎండీ ప్రకారం 22న ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి, 24వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడుతుంది. అయితే, ఇది తుపాన్‌గా మారుతుందా.. లేదా అనే దానిపై ఐఎండీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇస్రోకు చెందిన వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 25 తర్వాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడి దక్షిణ కోస్తాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముఖ్యంగా మన్యం ఏజెన్సీ గజగజ వణికిపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో బుధవారం ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీలుగా నమోదైంది. ఈ చలి ప్రభావం మరో రెండు, మూడు రోజులు కొనసాగి ఆ తర్వాత తగ్గుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం తెలంగాణలో చలిగాలులు వీయొచ్చని ఐఎండీ తెలిపింది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో.. రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos