కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ నెల 18 నాటికే అన్ని కార్యనిర్వాహక కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థలకు కమిటీలు వేస్తామన్నారు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం, ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూన్‌ 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని ఇప్పటివరకూ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏ మంచి చేసినా వైఎస్సార్సీపీ వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి త్వరగా కార్డులు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే మెజార్టీ నామినేటెడ్‌ పదవులు భర్తీ చేశామని మిగిలినవి త్వరలో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యత పార్టీకీ ఇస్తున్నామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు.

వికసిత్‌ భారత్‌-2047 కు అమరావతి బలమైన పునాదిగా మారుతుందని ఇదే విషయాన్ని మోదీ చెప్పారని గుర్తుచేశారు. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏడాది పాలనలోనే సృష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్న చంద్రబాబు 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పనిచేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,400 కోట్లు కేటాయించేలా చేసుకున్నామని BPCL, ఆర్సెలార్‌ మిత్తల్‌ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని తెలిపారు. లేపాక్షి-కొప్పర్తి కారిడార్‌ తీసుకొస్తామన్నారు. 11 చోట్ల MSME పార్కులు ప్రారంభించామని అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్‌ మోడల్‌.. ఏపీ రాష్ట్రంలోనూ అమలవ్వాలన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : CM Chandrababu Participates CII Summit 2026 : సీఐఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు |Amaravati Galam

తాజా వార్తలు

Related Videos