మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు విశాఖ లోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి కాన్వెంట్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్త ఐలాండ్ కూడలికి వెళతారు. ముందుగా.. వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి ఐదున్నర వరకు జరిగే రోడ్ షోకు మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్‌లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి వర్చువల్‌గా 2లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మోదీ రోడ్ షోకి 8 నియోజకవర్గాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో విశాఖ నగరం నిఘా నీడలో కొనసాగుతోంది. కేంద్ర బలగాలు, 5 వేలమంది పోలీసులు, 33మంది ఐపీఎస్‌లతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. బహిరంగసభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ మైదానం రెండు రోజుల కిందటే ఎస్పీజీ దళాల ఆధీనంలోకి వెళ్లింది.
ఇదిలావుండగా.. ఏపీ పర్యటనపై ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కొద్దిసేపటి కిందట ట్వీట్ చేశారు. ఇవాళ ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు మోదీ తెలుగులో పేర్కొన్నారు. అటు.. ప్రధాని మోదీ ట్వీట్‌కు బదులుగా రీట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు.. మీకు ప్రజల తరపున స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ టూర్ ఏపీ అభివృద్ధిలో కీలక ముందడుగు అని చెప్పారు. మీకు స్వయంగా స్వాగతం పలికేందుకు.. విశాఖ ప్రజలతో సహా మేమంతా ఎదురుచూస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా.. మోదీ విశాఖ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. మోదీ సభను ఆరునెలల పాలన విజయోత్సవ సభగా నిర్వహిస్తుండటం ఏపీలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos