ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు హస్తినకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపైన కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని చర్చించనున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపైన శుభవార్త చెప్పారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో 480 కోట్లతో నిర్మిస్తే దానిని కాపాడలేక గత ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ ఇప్పుడు వెయ్యి కోట్లతో నిర్మాణం చేస్తున్నట్టు త్వరలోనే అది పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో చంద్రబాబు నిధుల కోసం కేంద్రంపైన ఒత్తిడి తీసుకురానున్నారు. ఈ ఏడాది 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని దీనిని నిర్మాణం చేస్తున్న బవర్ కంపెనీ ప్రకటించింది.
ఇప్పటికే దాదాపు 93 శాతానికి పైగా పనులు పూర్తికాగా మిగతా పనులలో వేగం పెంచారు. ఏది ఏమైనా చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని సంకల్పించి ముందుకు వెళుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos