తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క, రెగ్యులర్ బస్సులు నిండిపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్, మియాపూర్ వైపు నివసించే వారి సౌకర్యార్థం బీహెచ్‌ఈఎల్ డిపో నుంచి ఏపీకి స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. బీహెచ్‌ఈఎల్ డిపో (ఆర్సీపురం) నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులు ఆర్సీపురం నుంచి బయలుదేరి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళతాయి. ఇవి ప్రధానంగా విజయవాడ, గుంటూరు, చీరాల, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తాయని బీహెచ్‌ఈఎల్ డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. రద్దీని బట్టి అదనపు బస్సులను పెంచేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలకు 9959226149 నెంబరును సంప్రదించవచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలు విమాన చార్జీలతో పోటీ పడుతున్న తరుణంలో ఆర్టీసీ కల్పిస్తున్న ఈ తక్కువ ధర సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
అదేవిధంగా .. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యోచిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కు లేఖ రాయాలని నిర్ణయించారు. ప్రతి ఏటా సంక్రాంతికి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముంది. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా వెళ్లేలా చూసేందుకే టోల్ మినహాయింపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఆర్అండ్‌బీ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం గనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే, ఈసారి సంక్రాంతి ప్రయాణం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos