మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలోనూ మార్పులు రావాలని, గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో స్థాయి వరకు ఎదిగేలా సంస్కరణలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అని, వారి త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నూతనంగా నియామకమైన 25 పార్లమెంట్ నియోజకవర్గాల కమిటీల కోసం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలమైన కార్యకర్తల వ్యవస్థ ఒక్క తెలుగుదేశానికే సొంతమని లోకేశ్ అన్నారు. "స్వర్గీయ ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ, మన బలం, బలగం మన కార్యకర్తలే. పుంగనూరులో నామినేషన్ పత్రాలు లాక్కున్నప్పుడు మీసాలు మెలేసిన అంజిరెడ్డి తాత, మాచర్లలో రక్తమోడుతున్నా పోలింగ్ బూత్‌లో నిలబడిన మంజుల, విజయవాడలో కంటిచూపు కోల్పోయినా జై టీడీపీ అన్న చెన్నుపాటి గాంధీ, మెడపై కత్తిపెట్టినా జై చంద్రబాబు అని ప్రాణాలు విడిచిన తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే నాకు స్ఫూర్తి" అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని లోకేశ్ గుర్తుచేశారు. "1983లోనే రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తి హక్కు వంటివి ఎన్టీఆర్ తెచ్చారు. ఆయన స్ఫూర్తితో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని" కొనియాడారు.

చంద్రబాబు ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని లోకేశ్ తెలిపారు. 1995లో ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారని, కానీ నేడు సైబరాబాద్ వల్లే లక్షలాది కుటుంబాలు బాగుపడ్డాయని అన్నారు. "మన నాయకుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి 'టీం 11' బ్రాండ్ అంబాసిడర్లు" అంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ వంటి సంస్థలు ఏపీకి రావడానికి చంద్రబాబుపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. "దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందిస్తున్నాం. ఒక్క పెన్షన్లకే ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 150 రోజుల్లో 16 వేల డీఎస్సీ పోస్టుల భర్తీ వంటివి పూర్తిచేశామని" వివరించారు.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని లోకేశ్ సూచించారు. "మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో, చేసిన పనులను చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం. పెన్షన్ చరిత్రను ప్రజలకు వివరించాలి. రూ.200 ఉన్న పెన్షన్‌ను మనమే రూ.2 వేలు చేసి, ఇప్పుడు రూ.4 వేలకు పెంచామని స్పష్టంగా చెప్పాలని" ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో అంతర్గత సంస్కరణల ఆవశ్యకతను లోకేశ్ నొక్కిచెప్పారు. "పార్టీలో ప్రతి పదవికి టర్మ్ లిమిట్ ఉండాలి. ఒకే వ్యక్తి ఒక పదవిలో రెండుసార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. వారు ప్రమోట్ కావాలి. ఒక సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్‌బ్యూరో వరకు ఎందుకు రాకూడదు? దీనికోసం పొలిట్‌బ్యూరోలో పోరాడానని" ఆయన తెలిపారు.

మహానాడులో తీర్మానించిన 'ఆరు శాసనాలను' పార్టీ నాయకులు తప్పనిసరిగా పాటించాలని లోకేశ్ ఆదేశించారు. కార్యకర్తలకే పెద్దపీట వేయాలని, యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని, సామాజిక న్యాయం పాటించాలని, మహిళలను గౌరవించాలని సూచించారు. అన్నదాతకు అండగా నిలుస్తూ, తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos