అమరావతిలో ఐకానిక్ భవనాల పనులను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఐకానిక్ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జనవరిలో పనులు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్‌మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను పునఃప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది.ఐకానిక్ భవనాలు 47, 39 అంతస్థుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఎలాంటి పనులు చేపట్టక పోవటంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకంగా మారింది. దీంతో, తొలుత వాటి పటిష్టత పైన సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంగా వీటి పైన మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించడంతో ఫౌండేషన్‌కి ఎటువంటి ఇబ్బంది లేదని నిపుణుల బృందం తేల్చింది. ఈ క్రమంలో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. జీఏడీ టవర్స్ 47 అంతస్థులు, టెర్రస్, హెలీప్యాడ్‌తో సహా నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక లు సిద్దం అయ్యాయి.
అదేవిధంగా 39 అంతస్థుల్లో హెచ్ఓడీ టవర్స్ నిర్మాణం చేయనున్నారు. అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సిద్దమయ్యారు. ఏడు అంతస్థులతో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నింటికీ ర్యాప్ట్ ఫౌండేషన్ పూర్తి చేసి జనవరి నెలా ఖరులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, సీఆర్డీఏ అధికారులు సైతం ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అటు ప్రభుత్వం నిరంతరం అమరావతి పనుల గురించి ఆరా తీస్తోంది. దీంతో, జనవరి నుంచి అమరావతి కొత్త రూపు సంతరించుకోనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos