ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయానికి నాంది పలుకుతూ, అమరావతి ఇవాళ శనివారం ఒక చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ భవన నిర్మాణానికి శనివారం పునాదిరాయి పడనుంది. ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హాజరుకానున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.

ఇవాళ శనివారం మధ్యాహ్నం 2:45 గంటలకు ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 3:00 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6:00 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటం విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కానుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ, రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టి వంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా, ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్ వంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుంది.  దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

క్వాంటం టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఉదాహరణకు, ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతమై కొత్త ఔషధాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల నిర్ధారణ మరింత కచ్చితంగా మారుతుంది. వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని కచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే, బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తిచేసి, డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు అమరావతి గ్లోబల్ హబ్‌గా మారుతుందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE: CM Chandrababu Lays Foundation Stone for LV Prasad Eye Hospital in Amaravati | Amaravati Galam

తాజా వార్తలు

Related Videos