ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలోని వాలంటీర్ వ్యవస్థపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నమ్ముకోవడం వల్ల ప్రజలు – నాయకుల మధ్య దూరం పెరిగిందని, తాము నేరుగా ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఆయన అంగీకరించారు. “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వాలంటీర్లపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రజల సమస్యలు సకాలంలో తెలుసుకోలేకపోయామని, రాజకీయంగా నష్టపోయామని బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా, ఈ వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ అధినేత జగన్‌పై కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జగన్‌కు కార్యకర్తలతో కలవడానికి, ఫొటోలు దిగడానికి సమయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఈసారి అయినా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ‘2.0 వ్యవస్థ’ను అమలు చేసి, తమను ఇబ్బంది పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ ఆ విధానాన్ని అమలు చేయకపోతే, తన నియోజకవర్గంలో తానే అమలు చేస్తానని అన్నారు.
ఇదిలాఉండగా.. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల కిందట వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో నరసరావుపేటలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థపై ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థే మా కొంప ముంచిందని, ఐదేళ్లు వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుని నష్టపోయామని, పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి వారిపై ఆధారపడటం తమ ఓటమికి ఒక కారణమైందని అన్నారు. ఈ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. మొత్తానికి, వాలంటీర్ వ్యవస్థను వైసీపీ సరిగా నిర్వహించలేకపోవడం, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం విపరీతంగా వాడుకోవడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని, అందుకే వైసీపీ నేతలే ఈ వ్యవస్థ తమను దెబ్బతీసిందని ఒప్పుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos