ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనలతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తెలంగాణ పిటిషన్ ను వెనక్కు తీసుకున్నారు. సుప్రీంతీర్పుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎవరికీ నష్టం ఉండదని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలని మొదటి నుంచి తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
సముద్రంలో వృధాగా కలిసే దాదాపు 3 వేల టీఎంసీల నీటిలో కేవలం 2 టిఎంసిలను మాత్రమే ప్రాజెక్ట్ కు వినియోగించుకుంటున్నామని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. అపోహలను వీడి, ఇప్పటికైనా ప్రాజెక్టుకు సహకరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం వాటిల్లదని, తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష కూడా అదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 50 సంవత్సరాలలో గోదావరి వరద నీరు ఒక లక్ష యాభై మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోయాయని గుర్తుచేసి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది కూడా 4600 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్లిపోయిందని తెలిపారు. గోదావరి వరద నీటిని పోలవరం వద్ద వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని, లేదంటే అది సముద్రంలో కలిసిపోతుందని పేర్కొన్నారు. కేవలం వృధా జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నామని గుర్తుచేసి దీనివల్ల తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇచ్చారో అదే రీతిలో దిగువన పోలవరం నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వాలని తాము కోరుతున్నామని తెలిపారు. తమ విజ్ఞప్తి సహజ న్యాయ సూత్రాలకు లోబడి ఉందని, సమంజసమైనది, సహేతుకమైనది అని నిమ్మల రామానాయుడు నొక్కి చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలోని గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని కాళేశ్వరం నిర్మించినప్పుడు, తాము ఎటువంటి అడ్డంకులు చెప్పలేదన్నారు. ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ కూడా అదేవిధంగా సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరితే ఆ తర్వాత తెలంగాణకు కూడా ప్రయోజనం చేకూరుతుందని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos