ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తదుపరి దర్యాప్తుకు సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ట్రయల్ కోర్టు నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వగా, వాటిని సుప్రీంకోర్టు స్వల్పంగా సవరించింది. నిర్ణీత గడువు విధించకుండా, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సూచించింది. దర్యాప్తు ప్రక్రియలో అవసరమైతే ఇంకా ఎవరినైనా విచారణకు పిలవడంపై ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఈ అంశాలు ఇప్పటికే స్పష్టంగా ఉన్నందున, ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ హైప్రొఫైల్ కేసులో దర్యాప్తు వేగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నాలుగేళ్ల తర్వాత దాన్ని పూర్తి చేసి అనంతరం గతేడాది సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. అనంతరం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైదరాబాద్ సీబీఐ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అనంతరం సీబీఐ కోర్టుకు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్య కేసులో చాలా అంశాల్ని సీబీఐ వదిలేసిందని పేర్కొంది. అయితే దీనిపై సీబీఐ కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో రెండు అంశాల వరకే సీబీఐ దర్యాప్తును పరిమితం చేసింది. దీంతో మరోసారి వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆదేశాల మేరకే సీబీఐ తదుపరి దర్యాప్తు జరిపేలా అనుమతి ఇచ్చింది. ఇంతకు మించి సునీత కోరుతున్నట్లుగా దర్యాప్తు చేయించేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో సునీతకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న ఉత్తర్వును మాత్రం సవరించి సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తును మాత్రం యథాతథంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos