ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలన సమయంలో లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు విచారణకు ఆదేశించారు. దాదాపు పది నెలల కాలంగా సిట్ విచారణ సాగుతోంది. ఇప్పుడు వైసీపీ ముఖ్యుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కేసులో విచారణకు హాజరు కానున్నారు. కాగా, ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు కసిరెడ్డి కోసం మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. హైదరాబాద్ లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. కీలక ఆధారాలు లభ్యం అయ్యాయ ని చెబుతున్న వేళ.. సాయిరెడ్డి - మిథున్ విచారణ ఉత్కంఠ పెంచుతోంది.
సాయిరెడ్డి ఈ రోజు అంటే గురువారం సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ మొత్తం కసిరెడ్డి అంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మద్యం కేసులో విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం ఇస్తానని గతంలోనే సాయిరెడ్డి స్పష్టం చేసారు. ఇప్పుడు సాయిరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. బీజేపీ కి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో సాయిరెడ్డి సిట్ ముందుకు వస్తే ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. కసిరెడ్డి విచారణకు రాకపోతే.. సిట్ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. కసిరెడ్డి పాత్ర ఏంటి అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. దీంతో, ఈ రెండు రోజుల్లో మద్యం కేసులో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదే సమయంలో మూడుసార్లు నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి స్పందించక పోవడంతో.. ఆయన తండ్రికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక.. కసిరెడ్డిని ఈ నెల 19న విచారణ కు హాజరవ్వాలంటూ సిట్ మరోసారి తాఖీదులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. శుక్రవారం అంటే రేపు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం.
ఇదే సమయానికి మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వీరిని మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి... కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే...మిథున్ విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ... విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాజ్ కసిరెడ్డికి 'సిట్' మరో నోటీసు జారీ చేసింది. ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే... తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో సిట్ సిబ్బంది సోదాలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉన్న రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించారు. మద్యం స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల విచారణ వేళ అవసరమైన సమాచారం రాబట్టే ప్రయత్నాలు సిట్ చేస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos