గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్ లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు. ఇక, ఆలపాటి రాజా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే, మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథితో పాటు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్డీయే కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ఆలపాటి గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సరైన నాయకుడు.. అందుకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని అన్నారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి బాటలో పెడుతున్నారని .. ఉద్యోగ అవకాశాలు, రైతాంగ ప్రోత్సాహకాలు అందిస్తూ కూటమి ప్రభుతం ముందుకెళుతోందని అన్నారు జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. టీడీపీ నాయకుడిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత ఆయన ప్రయాణం చంద్రబాబుతో సాగింది. స్వాత్రంత్య్ర సమరయోధుడు ఆలపాటి శివరామకృష్ణ తనయుడు. గుంటూరు జిల్లాలో జన్మించిన ఆయన అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించారు. స్టూడెంట్స్ వర్కింగ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీఎల్ పూర్తి చేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రెండోసారి 1999లో గెలిచాక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో విజయం సాధించారు. 2019లో ఓటమి చెందారు. 2024లో ఆయన తెనాలి నుంచి పోటీ చేయాలనుకున్నా.. కూటమి పొత్తులో భాగంగా ఆ సీటును నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి విజయానికి కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఆయన విజయం తధ్యం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos