ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా దోచుకున్న ఆ పార్టీ నేతలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో వారు ప్రభుత్వ పెద్దలను కాకా పట్టడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అప్పుడు అడ్డగోలుగా దోచుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జైలు భయం పట్టుకుంది. దీంతో కూటమి ప్రభుత్వం లోని ఎవరో ఒకరిని ప్రశంసిస్తూ వారికి దగ్గర కావాలని, కేసుల బారి నుంచి బయటపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ కొత్త దేవుడిగా కనిపిస్తున్నారు.
నిన్నటి వరకూ నిత్య పెళ్లి కొడుకు..దత్తపుత్రుడు అని నానా మాటలు అన్న వైసీపీ నేతలు, సోషల్ మీడియా అకౌంట్లే ఇప్పుడు పవన్ కల్యాణ్ జాతీయ నేత, సూపర్ లీడర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఎందుకంటే కాళ్లు పట్టేసుకుంటున్న తమను ఆయన కాపాడుతారని వారి నమ్మకం. అప్పుడంతా అడ్డగోలు దోపిడీలు చేసి... ఇప్పుడు పవన్ కల్యాణ్ ను కాకా పడితే ఆయన కాపాడుతారా అన్న సందేహం వారికి రాకపోలేదు. కానీ ఇక పవన్ తప్ప వారికి వేరే దిక్కులేదు. ఎందుకంటే చంద్రబాబు వారిని దరిచేరనివ్వరు.
ఇక పవన్ కళ్యాణ్ ఒక్కడే వారికి కాపాడే దిక్కుగా భావిస్తున్నందున ఓ రాయి వేస్తే పోలా అని పవన్ కల్యాణ్‌పై పొగడ్తల రాళ్లు విసురుతున్నారు. తమపై ఏదో ఓ మూల పవన్ సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకుంటే చాలని తర్వాత కష్టాల్లో మాట సాయం అయినా చేస్తారని వారు ఆశపడుతున్నారు. అందుకే నిన్న విజయసాయిరెడ్డి ... జనసేనానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బాటలోనే చాలా మంది ముందుకు రాబోతున్నారు. అందరూ పవన్ సీఎం అవ్వాలని కోరబోతున్నారు. చివరికి జగన్ రెడ్డి నోటి నుంచి కూడా ఆ మాట వస్తుందని చెబుతున్నారు.
ఈ పొగడ్తల వెనుక మరో వ్యూహం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు.. పవన్ ను కూటమి నుంచి బయటకు తెచ్చేందుకు వైసీపీ నేతలు ఇలా కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని వారు అంటున్నారు. అయితే ఇలా ఎప్పటికీ జరగదని, వారి ఆశలు ఫలించని అందరికీ తెలుసు. మరోవైపు.. పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు పొగిడే కొద్దీ వైసీపీ ఇంకా ఇంకా భూమిలోతుల్లోకి దిగిపోతూ ఉంటుందనేది వాస్తవం. ఇలా క్రమేణ ఆ పార్టీ స్థానాన్ని జనసేన అందుకుంటూ ఉంటుంది. ఈ మాత్రం రాజకీయం వాళ్లకీ తెలుసు కానీ.. ఇప్పుడు తాము తిన్న సొమ్ము కక్కకుండా.. జైళ్లకు వెళ్లకుండా కాపాడేది పవన్ కల్యాణేనని వారు నమ్ముకుంటున్నారు. అందుకే విధి లేని పరిస్థితుల్లో, ఇష్టం లేకున్నా పవన్ ను కొత్త దేవుడిగా కీర్తిస్తున్నారు. వైసీపీ నేతలకు ఎంత కష్టం వచ్చిందో కదా పాపం అంటూ ఇతర పార్టీల నేతలు వ్యంగ్యంగా కామెంట్లు చేసుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos