రాజధాని అమరావతికి ప్రతిష్ఠాత్మక సంస్థలు విరివిగా వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (BITS) క్యాంపస్ ఏర్పాటుకు సీఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరడమే కాకుండా... తమ సంస్థ భవనాలను కూడా దేవాలయం నమూనాలో నిర్మిస్తామని ప్రతిపాదించింది.
వాస్తవంగా రాజధాని అమరావతిలో ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్‌కి స్థలం ఇవ్వాలని సీఆర్డీఏ భావించింది. అక్కడైతే 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే 35 ఎకరాలు మాత్రమే ఇవ్వగలమని సీఆర్డీఏ స్పష్టం చేసింది. మరోవైపు ఎక్స్ఎల్ఆర్ఐ కూడా త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థకు ఐనవోలు వద్ద 2014-19లోనే సీఆర్‌డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడూ అదే స్థలాన్ని ఆ సంస్థకు ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకొచ్చింది. అదేవిధంగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కి అప్పట్లో 28 ఎకరాలు కేటాయించారు. అవసరమైతే దాన్ని కొంచెం పెంచి సీపీడబ్ల్యూడీ ద్వారా భారీ కాంప్లెక్స్ నిర్మించి కేంద్రప్రభుత్వ సంస్థల కార్యాలయాలన్నీ దానిలోనే ఏర్పాటు చేసేలా చూడాలని సీఆర్డీఏ భావిస్తోంది.
ఇక రాష్ట్రప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లకు గతంలో కేటాయించిన స్థలాల్ని రద్దు చేసి వాటి కార్యాలయాలనూ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్లలోనే ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియం, ల్యాబ్‌లకు మాత్రం విడిగా స్థలాలు కేటాయించనున్నారు. రాజధానిలో 2014-19 మధ్య స్థలాలు తీసుకున్న కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు ఐదేళ్ల జగన్ పాలనలో మిన్నకుండిపోయాయి. ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా పట్టాలెక్కుతున్ననందున స్థలాలిస్తే నిర్మాణాలు ప్రారంభిస్తామంటూ ఆ సంస్థలన్నీ చెబుతున్నాయి. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్ గతంలో చేసిన కేటాయింపులన్నిటినీ సమీక్షించాలని నిర్ణయించింది. దానికోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos