రాజధాని అమరావతి నిర్మాణ పనుల గురించి చర్చించడానికి ఏపీ మంత్రివర్గం సమావేశమైంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. అమరావతిలో చేపట్టదలిచిన అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కేపిటల్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు నిర్మాణ పనులను దక్కించుకున్న ఏజెన్సీలకు అందజేయాల్సిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొత్తంగా 45,249 కోట్ల పనులకు గతంలో సీఆర్డీఏ అనుమతులు ఇచ్చినట్టయింది. ఇందులో అసెంబ్లీ భవనానికి రూ. 765 కోట్లు, హైకోర్టు భవనానికి 1,048 కోట్లు, అయిదు ఐకానిక్ టవర్లకు 4,665 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సీఆర్డీఏ వెల్లడించింది.
అలాగే రహదారుల టెండర్ల కోసం మరో రూ.9,699 కోట్లు, ఇతర రోడ్లకు 7, 794 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారని సమాచారం. ఈ పరిస్థితుల మధ్య మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. అనంతరం అనంతవరంలో విలేకరులతో మాట్లాడారు. 58 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు స్వచ్చందంగా ఇచ్చారని అన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇందులో భాగంగా నార్మన్ పోస్టర్ సంస్థ ద్వారా అయిదు ఐకానిక్ టవర్స్ డిజైన్ చేయించామని నారాయణ చెప్పారు. అమరావతిని మరింత విస్తరించడంలో భాగంగా 40,000 ఎకరాల భూమిని సేకరించాలనే అలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.
మొదటి విడతలో 64,000 కోట్ల రూపాయలు పనులకు ఇప్పటికే టెండర్లు ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తీరు వల్ల అమరావతి పరిధిలో అన్ని నిర్మాణాలు స్తంభించిపోయాయని, ఇప్పుడు మళ్ళీ 92 సంస్థల పనులు మొదలు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు. వచ్చే 100 సంవత్సరాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని నారాయణ వివరించారు. భవనాల నిర్మాణానికి, రోడ్లు వేయడానికి తప్పనిసరిగా కంకర, గ్రావెల్ కావాల్సిందేనని, చాలినంత మెటీరియల్‌ను సమీకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అనంతవరంలో కంకర, గ్రావెల్ తవ్వకాలు భారీగా జరిగాయని, అవసరమైన దానికంటే లోతుగా తవ్వారని చెప్పారు. అమరావతి గ్రామాల్లో డ్రోన్ సహాయంతో సర్వే పనులు చేపట్టామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
హైదరాబాద్ తరహాలో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం కట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరలోనే చేపడతామని ఆయన తెలిపారు. ల్యాండ్ పూలింగ్, లేదా భూసేకరణ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఎయిర్ పోర్ట్ కోసం 5,000 నుండి 8,000 ఎకరాలు అవసరమవుతాయని నారాయణ చెప్పారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అందుబాటులో ఉండటం వల్ల దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారని, వాళ్లు నివాసం ఉండటానికి హోటళ్లు అవసరమవుతాయని, వాటి నిర్మాణం- ఇతరత్రా కార్యకలాపాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos