ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతి పనుల రీ లాంచ్ కోసం ప్రధాని మోదీ రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ.. వెలగపూడిలోని సచివాలయం వెనుక ప్రాంతంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు మాత్రం భారీగా జరుగుతున్నాయి. అమరావతిలో ప్రధాని మోదీ సభకు భారీగా జనసమీకరణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించారు.
మే రెండో తేదీ మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చంద్రబాబు వెల్లడించారు. ఇదే సమయంలో మూడేళ్లలోగా అమరావతిలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రహదారులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇదే సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. భవిష్యత్తులో అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగాసిటీగా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ పైన కసరత్తు జరుగుతోంది. దీని కోసం కొత్తగా అవసరమైన భూములు, ఆర్దిక వనరులపైన నిపుణుల నివేదిక కోరారు.
అమరావతిని విస్తరించాలని.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం దాదాపు 6 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం అవుతుందని భావిస్తున్నారు. దీంతో, ఈ మేరకు భూముల పరిశీలన ప్రారంభమైంది. ఇందుకోసం కావాల్సిన భూములను సేకరించాలా.. సమీకరణ చేయాలా అనేది ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందనే చర్చ సాగుతోంది. సమీకరణ ద్వారా అయితే రైతులకు ప్రయోజనం ఉండటంతో వారు అదే కోరుకుంటున్నారు. అదే విధంగా క్రీడానగరాన్ని నిర్మించాలనే ఆలోచనా ఉందని తాజాగా మంత్రి నారాయణ వెల్లడించారు.
అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయటానికి గనులశాఖ 5 జిల్లాల్లో 851 ఎకరాలను సీఆర్‌డీఏకు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్‌తో మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయంచారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కి.మీ. ట్రంక్ రోడ్లు నిర్మించనున్నారు. రెండున్నరేళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో రూ.64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రధాని పర్యటనలో కేంద్రం నుంచి అమరావతికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos