వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యల కేసులో గత వారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలులో ఉన్న ఆయనను ఇవాళ గుంటూరుకు తరలించారు. పీటీ వారెంట్‌పై పోలీసులు ఆయన్ను గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. ఇటీవల సీఎం చంద్రబాబుపై దూషణాత్మక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో మరికొన్ని కేసుల విచారణ కోసం పోలీసులు చర్యలు చేపట్టారు.
గత ఏడాది నవంబర్ 12న వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ధర్నాలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అతడిపై కేసు నమోదైంది. ఈ ఘటనపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం పట్టాభిపురం పోలీసులు ఆదివారం పీటీ వారెంట్ దాఖలు చేయగా, గుంటూరు కోర్టు దాన్ని స్వీకరించింది. పీటీ వారెంట్ మేరకు అంబటి రాంబాబును గుంటూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు. ఈ పిటిషన్‌పై కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. మరోవైపు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు పోలీసుల కస్టడీ పిటిషన్‌పైనా కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos