వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు సొంత పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టు నేతలంతా ఫ్యాన్‌ పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. ఇటీవల తాజాగా వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ గుడ్‌బై చెప్పేశారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు.. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆయన దారిలోనే సిక్కోలుకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వైసీపీకి వీడేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది.

గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాద రావు.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది  కావస్తున్నా ఆయన మౌనవ్రతం వీడటం లేదు. ఇటీవల సిక్కోలు నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను మాజీమంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఉత్తరాంధ్ర నేతలందరితో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి సైతం ధర్మాన డుమ్మా కొట్టారు. దాంతో ఆయన ఇకమీదట కూడా పార్టీ కార్యక్రమాలకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు తమ్మినేని సీతారామ్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల అముదాలవలస వైసీపీ ఇన్ చార్జ్‌గా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో మనస్తాపం చెందిన తమ్మినేని పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడం లేదు. సిక్కోలు రాజకీయాల్లో దాదాపు మూడు, నాలుగు దశాబ్ధాలుగా కీలకపాత్ర పోషించినా తమ్మినేనిని ఉన్నపళంగా ఇన్ చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. 

కాగా గతంలో వైఎస్ జగన్‌కు వీరవిదేయులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు.. సడెన్‌గా పార్టీ మారాలనే నిర్ణయం వెనుక.. మాజీఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి..త్వరలోనే కమలం పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఆయనతో పాటు.. ఈ ఇద్దరు నేతలు కూడా కమలం పార్టీలో చేరుతారని చెబుతున్నారు.. మొత్తంగా ఏపీలో వైసీపీ టార్గెట్‌గా బీజేపీ ఆపరేషన్‌ కొనసాగుతోందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

Related Videos